వైజాగ్ బుక్ లవర్స్ క్లబ్ మీకు ఆహ్వానం
పలుకుతోంది.
మితృలకు అభివాదాలు.
సాహిత్యప్రియులతో పాటు పుస్తకాలను అభిమానించే ప్రతివారి ఆకాంక్షలకు
అనుగుణంగా ఏర్పడ్డదే మన ఈ క్లబ్.మంచి పుస్తకాలను ప్రోత్సహించటం,రచయితలు,కవులు,గ్రంథకర్తలు,ప్రచురణకర్తలు,సమీక్షకులు,విమర్శకులు,ముద్రణాలయాల వారు,పంపిణీదారులు,విక్రేతలు ఇలా ప్రతివారితోనూ
పాఠకులు ముఖాముఖి మాట్లాడేవేదికను కల్పించంటంలో ఒక సాధనంగా పనికిరావాలన్నది మన క్లబ్ ఆశయాలలో ఒకటి.చాలావరకు
పుస్తకావిష్కరణ సభలు ప్రచారవేదికలుగానూ,సమీక్షలు
వ్యాపారప్రకటనలుగానూ క్షీణరూపాంతరం చెందుతూ,నానాటికీ అడుగంటుతున్న పాఠకుల సంఖ్యను మరింతగా
కృశింపజేస్తున్న వికృతధోరణికి విరుగుడుగా ఏర్పడిందే మన ఈ
క్లబ్.
సుమారు పన్నెండువరకూ భాషాసంస్కృతులు ఉన్న విశాఖనగరములో పాఠకులద్వారా జాతీయసమైక్యతకు మరింతగా ఊపిరులూదాలని చేస్తున్న
ఒక చిరు ప్రయత్నమే మన ఈ క్లబ్.అద్భుతమైన సాహితీవారసత్వాన్ని
కలిగిఉన్న ఈ నగరంలో గతవైభవకీర్తులనూ,దివంగతసాహితీమూర్తులను స్మరించుకుంటూనే,వర్తమాన,వర్థమాన రచయితల స్వంతగొంతులను పాఠకజనావళికి పరిచయం చేయటం మన క్లబ్ కార్యకలాపాలలో ప్రధానమైనది.
పుస్తకపు ప్రాముఖ్యాన్ని మరచిపోతున్నవారికి మరొక్కసారి జ్ఞాపకం
చెయ్యటం,బాలలు,యువతను
పుస్తకాలవైపు మళ్ళించేందుకు మొదటిదశ ఈ క్లబ్ స్థాపన.
ఎన్ని సాంకేతికసౌలభ్యాలు సమకూరినా హస్తభూషణం వంటి పుస్తకాన్ని
చేతపుచ్చుకు చదవటంలోని
మధురిమను మరొకమారు పరిమళింపజేయాలన్న
మా ఆశయానికి ప్యూపాదశ ఈ క్లబ్.స్థానికులైన సాహితీవేత్తలతోపాటు నగరానికొచ్చిన రచయితలతో
ఆత్మీయసమావేశాలు నిర్వహించటం,ఆహ్లాదకరవాతావరణములో
పుస్తకావిష్కరణలూ,పుస్తకపరిచయాలు
జరపటం,పాఠకులు నిర్మొహమాటంగా
తమ అభిప్రాయాలను రకరకాల మాధ్యమాల ద్వారా వెల్లడించేలా ప్రోత్సహించటం,వాటికి సమాధానాలను రాబట్టటం వంటి ‘టు వే కమ్యూనికేషన్ ’ వ్యవస్థను ప్రతిష్ఠించటం
మన ఈ క్లబ్ ధ్యేయం.
అవకాశమున్న ప్రతివారూ హాజరయ్యేందుకు ప్రయత్నించండి.పొరుగూర్ల
నుండి విశాఖ వస్తున్న వారు కనీసం ఒక పదిరోజుల ముందు తెలియజేస్తే
ఏర్పాట్లు సమగ్రంగా చేసేందుకు అవకాశముంటుంది.
మీ అందరి సహాయసహకారాలను అర్థిస్తూ
భవదీయుడు
రాజేంద్ర కుమార్
98660 21972.